టీడీపీలో టికెట్లు హౌస్‌ఫుల్.. రాధా ఫ్యూచర్ ఏంటీ , వైసీపీలోకి వంగవీటి రీ ఎంట్రీ ఇస్తారా..?

 



ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ , సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేనలు తొలి జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ఒకేసారి 94 మంది అభ్యర్ధుల్ని ప్రకటించింది. అయితే కీలక నేతలకు టీడీపీ స్థానం కల్పించకపోవడంతో అలాంటి వారు అసమ్మతి రాగాలు వినిపిస్తున్నారు. వీరిలో కొందరిని చంద్రబాబు బుజ్జగిస్తుండగా.. ఇంకొందరు మాత్రం తమ దారి తాము చూసుకుంటున్నారు. 

రాష్ట్రంలోని బలమైన సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వున్న వంగవీటి రాధాకృష్ణకు తెలుగుదేశం హైకమాండ్ టికెట్ నిరాకరించింది. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయవాడ సెంట్రల్, ఈస్ట్ నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు అభ్యర్ధులను ప్రకటించారు. దీంతో ఇప్పుడు రాధా పరిస్ధితి ఏంటన్నది చర్చనీయాంశమైంది. 

టికెట్ దక్కని మిగిలిన నేతలంతా చంద్రబాబుతో భేటీ అవ్వడమో, రోడ్లెక్కి ఆందోళన చేయడమో చేస్తుంటే రాధా బ్యాచ్ మాత్రం చడీ చప్పుడు చేయడం లేదు. ఇదే అదనుగా రాధాను వైసీపీలోకి లాగాలని ఆ పార్టీ హైకమాండ్ భావిస్తోంది. 

దీనిలో భాగంగా మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు నిన్న వంగవీటి రాధాతో భేటీ అయ్యారు. మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్ధిగా ఆయనను బరిలోకి దించాలని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గుంటూరులో జరిగిన తన తండ్రి వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ సభలో మంత్రి విడుదల రజనీతో కలిసి రాధా పాల్గొన్నారు. ఈ పరిణామాలు రాధాకు వైసీపీ దగ్గరవుతున్నారు అనడానికి బలం చేకూరుస్తోంది. 

వంగవీటి రాధా ప్రస్థానం :

వంగవీటి మోహనరంగా వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన.. కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 

సక్సెస్‌ఫుల్‌గా రాధా కెరీర్ సాగుతున్న దశలో తన సొంత సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ సినీనటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు రాధాబాబు. 2009లో పీఆర్‌పీ టికెట్‌పై విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి మల్లాది విష్ణు చేతిలో ఓటమి పాలయ్యారు. 

తదనంతరం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో రాధా తిరిగి కాంగ్రెస్ మనిషిగా మారారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత హస్తం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో భూస్థాపితం కావడంతో రాజకీయ భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీలో చేరారు రాధా. 

2014 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఆయన.. టీడీపీ అభ్యర్ధి గద్దె రామ్మోహన్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు టికెట్ ఆశించి అది దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్‌తో వచ్చిన విభేదాల కారణంగా వైసీపీకి రాజీనామా చేసి సరిగ్గా ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. 

అప్పటికే అభ్యర్ధుల ఎంపిక పూర్తి కావడంతో తను పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. తాజాగా తన కుటుంబానికి, సామాజిక వర్గానికి మంచి పట్టున్న విజయవాడ సెంట్రల్, తూర్పు నియోజకవర్గాల్లో బోండా ఉమా, గద్దె రామ్మోహన్‌లకు హైకమాండ్ టికెట్ ఖరారు చేసింది. పోనీ మచిలీపట్నం నుంచి ఎంపీగా బరిలోకి దిగుదామంటే.. అక్కడి సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరీ జనసేనలో చేరి పొత్తులో ఆ సీటు దక్కించుకున్నారు. 

వైసీపీలోనూ విజయవాడ సెంట్రల్ స్థానం వెల్లంపల్లి శ్రీనివాసరావుకు ఖరారు కాగా.. తూర్పులో దేవినేని అవినాష్‌కు బెర్త్ కన్ఫర్మ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో రాధా భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారింది. మరి రాధా ఒకవేళ వైసీపీలో చేరితే ఆయన కోసం జగన్ కీలక నిర్ణయం తీసుకుంటారా .. లేదా అన్నది వేచి చూడాలి. 

Comments